హృదయపూర్వం'నటీనటులు: మోహన్ లాల్, మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్, సిద్ధిఖీ, లాలూ అలెక్స్ తదితరులతో పాటు అతిథి పాత్రల్లో బసిల్ జోసెఫ్, మీరా జాస్మిన్, ఆంటోనీ పెరంబూర్.
సినిమాటోగ్రఫీ: అను మూతెదత్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
నిర్మాత: ఆంటోనీ పెరంబూర్
దర్శకత్వం: సత్యన్ అంతికాద్
ఓటీటీ వేదిక: జియో హాట్స్టార్
Mohanlal's Hridayapoorvam Review In Telugu: మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళ సినిమా 'హృదయపూర్వం'. ప్రభాస్ 'ది రాజా సాబ్' హీరోయిన్ మాళవికా మోహనన్ నటించారు. 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్ ఇతర ప్రధాన తారాగణం. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు సెప్టెంబర్ 26 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Hridayapoorvam Story): కొచ్చిలోని సందీప్ బాలకృష్ణన్ (మోహన్ లాల్)కు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరుగుతుంది. ఆ గుండె పూణేలోని యాక్సిడెంట్కు గురైన కల్నల్ రవీంద్రది. తన నిశ్చితార్థానికి రావాల్సిందిగా కల్నల్ కూతురు హరిత (మాళవికా మోహనన్) నుంచి సందీప్ బాలకృష్ణన్కు ఫోన్ వస్తుంది. తొలుత పూణే వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసినప్పటికీ... చివరకు వెళతాడు.
నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు దాన్ని హరిత క్యాన్సిల్ చేసుకోవడంతో జరిగిన గొడవలో సందీప్ బాలకృష్ణన్ వెన్నెముకకు గాయం అవుతోంది. దాంతో రెండు వారాలు పూణేలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు కల్నల్ కూతురు హరిత, కల్నల్ భార్య దేవిక (సంగీత మాధవన్ నాయర్), సందీప్ బాలకృష్ణన్ మధ్య ఏం జరిగింది? ఎవరెవరి మధ్య ఎటువంటి అనుబంధం చిగురించింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Hridayapoorvam Telugu Review): ప్రేమకు వయసుతో సంబంధం లేదు - ఈ పాయింట్ బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చాయి. ఇటీవల నారా రోహిత్ 'సుందరకాండ' వచ్చింది. అందులో తన కంటే వయసులో చిన్నదైన అమ్మాయితో ప్రేమలో పడతాడు హీరో. కట్ చేస్తే... గతంలో తల్లిని ప్రేమించి ఉంటాడు. చివరకు ఎవరిని ప్రేమను గెలిచాడు? అనేది కథ. 'హృదయపూర్వం'లో ఆ ఛాయలు కాస్త కనపడతాయి. హీరో (మోహన్ లాల్)పై కుమార్తె (మాళవికా మోహనన్)తో పాటు తల్లి (సంగీత మాధవన్ నాయర్) కూడా ప్రేమిస్తుందా? అనే సందేహం కలిగేలా కథను నడిపాడు దర్శకుడు. అయితే... 'సుందరకాండ' కంటే 'హృదయపూర్వం'లో కింగ్ అక్కినేని నాగార్జున, శ్రీకాంత్, సౌందర్యల 'నిన్నే ప్రేమిస్తా' ఎక్కువ గుర్తుకు వస్తుంది.
'నిన్నే ప్రేమిస్తా'లో నాగార్జున ఆర్మీ ఆఫీసర్. ప్రమాదంలో మరణించిన అతని కళ్ళు దానం చేయడం ద్వారా చూపు కోల్పోయిన శ్రీకాంత్కు చూపు వచ్చేలా చేస్తారు. ఆ కళ్ళు చూసి నాగార్జునను పెళ్లి చేసుకోవాల్సిన సౌందర్య మురిసిపోతే ప్రేమ అని ఫీల్ అవుతారు శ్రీకాంత్. అక్కడ కళ్ళు అయితే... 'హృదయపూర్వం'లో గుండె. ఇక మిగతా కథంతా సేమ్ టు సేమ్ అన్నట్టు... తండ్రి గుండె అమర్చిన వ్యక్తిని చూసి కుమార్తె, భర్త గుండె అమర్చిన మనిషిని చూసి భార్య అభిమానం, అనురాగం చూపిస్తారు. తెలుగు ప్రేక్షకులకు 'హృదయపూర్వం' కథ తెలిసినట్టే ఉంటుంది.
ఓ సాధారణ కథకు మోహన్ లాల్ స్క్రీన్ ప్రజెన్స్ యాడ్ కావడంతో మన కళ్ళకు కాస్త కొత్తగా కనిపిస్తుంది 'హృదయపూర్వం'. మోహన్ లాల్ - మాళవిక, మోహన్ లాల్ - సంగీత మాధవన్ నాయర్ మధ్య సన్నివేశాల్లో దర్శక రచయితలు గీత దాటలేదు. ప్రతి సన్నివేశాన్ని హుందాగా రాశారు. అయితే సరైన ముగింపు ఇవ్వడంలో సక్సెస్ కాలేదు. ఎండింగ్ వచ్చేసరికి భావోద్వేగాలను లోతుగా ఆవిష్కరించకుండా పైపైన తేల్చేశారు. నిదానంగా సాగిన సినిమాలో వినోదం రిలీఫ్ ఇచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ నీట్గా, క్లాసీగా ఉంది. కెమెరా వర్క్, మ్యూజిక్ ఒక ప్లజెంట్ ఫీల్ ఇచ్చాయి. మరీ నిదానంగా సాగిన కథ, కథనాలు బోర్ కొట్టిస్తాయి.
సందీప్ బాలకృష్ణన్ పాత్రలో మోహన్ లాల్ రిలాక్స్డ్గా నటించారు. ఆయన పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. సింపుల్ రోల్లో చక్కగా వినోదం పండించారు. ఈ కథలో మాళవికా మోహనన్ది హీరోయిన్ రోల్ అని చెప్పలేం. అలాగని కాదని కూడా అనలేం. కొత్త తరహా కథలో కూల్గా కనిపించారు. మోడ్రన్ అమ్మాయిగా డ్రస్సింగ్ బావుంది. మోహన్ లాల్ పక్కన మరీ యంగ్గా కనిపించకూడదని మేకప్ పరంగా కాస్త పెద్దగా కనిపించే ప్రయత్నం చేశారు. ఆమె తల్లిగా సంగీత మాధవన్ నాయర్ నటన బావుంది. మోహన్ లాల్ సహాయకుడిగా నర్స్ పాత్రలో సంగీత్ ప్రతాప్ కొంత నవ్వించారు. ఓ సన్నివేశంలో బసిల్ జోసెఫ్ నవ్వించారు. చివరిలో మీరా జాస్మిన్ తళుక్కున మెరిశారు. మిగతా నటీనటులు ఓకే.
'హృదయపూర్వం' మిగతా సినిమాలకు భిన్నంగా ఉంటుంది. రెగ్యులర్ సినిమాల్లో కనిపించే కథ, కథనాలకు భిన్నంగా సాగుతుంది. నాగార్జున 'నిన్నే ప్రేమిస్తా', నారా రోహిత్ రీసెంట్ సినిమా 'సుందరకాండ' ఛాయలు కనిపిస్తాయి. అందువల్ల తెలుగు ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యే అవకాశాలు తక్కువ. రొటీన్గా సాగే మోహన్ లాల్, మాళవికా మోహనన్, సంగీత మాధవన్ నాయర్, సంగీత్ ప్రతాప్ పెర్ఫార్మన్స్ - వినోదం కాస్త రిలీఫ్ ఇచ్చాయి. మోహన్ లాల్ అభిమానులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా స్ట్రీమింగ్ చేస్తే... ఓటీటీ కాబట్టి నిదానంగా ఫార్వర్డ్ చేసుకుంటూ చూడొచ్చు. లేదంటే బోర్ కొడుతుంది.