పైగా హిరణ్యకశిపుడు - ప్రహ్లాదుడి కథ తెలిసినదే కదా కొత్తగా ఏముంటుందని కొందరు అనుకున్నారు. కానీ అందరి అంచనా లు తల్లకిందులు చేస్తూ భారీ వసూళ్లతో ఇండియన్ యానిమేటెడ్ హిస్టరీలో ఓ మైలురాయిగా నిలిచింది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని హింసలకు గురిచేసిన తండ్రి హిరణ్య కశిపుడిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు నారసింహుడి రూపంలో వస్తాడు. దీనిపై అప్పుడెప్పుడో భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది. అదే కథని యానిమేషన్లో చూస్తే మహావతార్ నరసింహ. కేవలం 15 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ పది రోజుల్లో 100 కోట్ల మార్క్ దాటేసింది.
'మహావతార్: నరసింహ' సినిమాలో హీరో ప్రహ్లాదుడు - విలన్ హిరణ్య కశిపుడు అని ప్రేక్షకులు ఫిక్సైపోతారు.
హీరో ప్రహ్లాదుడే కానీ.. హిరణ్య కశిపుడు విలన్ కాదు....ఎందుకంటే ఆయన కూడా శ్రీ మహావిష్ణువు భక్తుడే.
ప్రహ్లాదుడు హరినామస్మరణ చేశాడని ఆగ్రహంతో ఊగిపోయి హింసలకు గురిచేసిన హిరణ్యకశిపుడు భక్తుడు ఎలా అవుతాడు?
ఆ భక్తే ఉంటే...స్వయంగా భక్తుడిని శ్రీ మహావిష్ణువు ఎందుకు సంహరించాడు?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సత్యయుగంలో ఏం జరిగిందో, పురాణాల్లో ఏముందో తెలుసుకోవాలి..
నిత్యం శ్రీ మహావిష్ణువు సేవలో మునిగితేలే ఇద్దరు భక్తులున్నారు..వారే జయ, విజయులు. ఇద్దరూ వైకుంఠలో కావలిగా ఉండేవారు. నిత్యం స్వామివారి సేవలో మునిగితేలే ఈ భక్తులో ఓ సంఘటన కారణంగా శత్రువులుగా మారాల్సి వచ్చింది.
బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనత్కమార, సునంద, సనత్సులు..శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళ్లారు. మొదట ఆరు ద్వారాలు తమ మహిమతో దాటుకుని వెళ్లిపోయారు. ఏడో ద్వారానికి రాగానే వారిని కనిపెట్టారు పరమభక్తులైన జయవిజయులు. స్వామి దర్శనానికి వెళతాం పక్కకు తప్పుకోమని చెప్పినా జయ విజయులు అంగీకరించరు. ఆగ్రహించిన బ్రహ్మమానసపుత్రులు..ఎంత విన్నవించకున్నా కఠినంగా ఉన్న మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపిస్తారు. ఈ విషయం తెలిసిన విష్ణువు..స్వయంగా తరలివచ్చి బ్రహ్మ మానసపుత్రులను లోపలకు ఆహ్వానిస్తాడు. అప్పుడు తమకు మునులు ఇచ్చిన శాపం గురించి చెప్పి శాపవిమోచనం కల్పించాలని వేడుకుంటారు. అయితే శాపఫలితం నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదన్న విష్ణువు.. ఓ పరిష్కారం చెప్పాడు.
1.హితులుగా ఏడు జన్మలు భూలోకంలో ఉంటారా?
2. విరోధులుగా మూడు జన్మలు శాఫఫలితాన్ని అనుభవిస్తారా?
హితులుగా 7 జన్మలు మీకు సేవచేసే భాగ్యానికి దూరమయ్యే కన్నా..విరోధులుగా మూడు జన్మల శాపఫలం అనుభవించడమే మంచిది అన్నారు. అలా వైకుంఠ ద్వారపాలకులు అయిన జయవిజయులు మూడు జన్మల్లో విష్ణువుకి విరోధులుగా జన్మించారు
హిరణ్యాక్షుడు , హిరణ్యకశిపులు
రావణుడు, కుంభ కర్ణుడు
శిశుపాలుడు, దంతవక్త్రలు
మొదటి జన్మలో భాగంగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులుగా జన్మించి విష్ణుని ద్వేషిస్తారు. తన కుమారుడు అయిన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అనుక్షణం నారాయణ మంత్రం జపిస్తుంటాడు. అందుకే ప్రహ్లాదుడిని అంతం చేసేందుకు సకల ప్రయత్నాలు చేసి విఫలం అవుతాు హిరణ్య కశిపుడు. అసలు నారాయణుడే లేడంటూ తనయుడితో వాదనకు దిగిన ఉంటే ఎక్కడున్నాడో చూపించు అని స్తంభంపై కొడతాడు. ఆ స్తంభం చీల్చుకుంటూ నరసింహస్వామి వచ్చి హరిణ్యకశిపుడిని సంహరిస్తాడు ( శాప విమోచనం కల్పిస్తాడు). వరాహ అవతారంగా వచ్చి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు.
రెండో జన్మ త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడిగా జన్మించిన జయవిజయులకు రాముడిగా వచ్చి శాపవిమోచనం కల్పించాడు శ్రీ మహావిష్ణువు
మూడో జన్మ ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవక్రలుగా జన్మించిన జయవిజయులకు శ్రీ కృష్ణావతారంలో వచ్చి శాపవిమోచనం కల్పించాడు నారాయణుడు
మూడు జన్మల శాపఫలితాన్ని అనుభవించి కలియుగం వచ్చేసరికి తిరిగి జయ విజయులు వైకుంఠ ద్వారపాలకులుగా వెళ్లిపోతారు. ప్రతి వైష్ణవ ఆలయంలో గర్భగుడి బయట అటు ఇటు రెండు విగ్రహాలు కనిపిస్తాయి. వారే జయవిజయులు.