Brahmanda Review



ఆమని, కొమరక్క కీలక పాత్రలతో రూపుదిద్దుకున్న చిత్రం “బ్రహ్మాండ”. దాసరి సునీత సమర్పణలో దర్శకుడు రాంబాబు దాసరి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ చిత్రం విడుదల కాకముందే దర్శకుడు రాంబాబు కన్నుమూయడం చిత్ర బృందంతో పాటు అందరినీ కలచివేసింది. వారి కష్టానికి ప్రతిరూపంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దాసరి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి వరికుప్పల యాదగిరి సంగీతం అందించగా, రమేష్ రాయ్, జి.ఎస్. నారాయణలు సంభాషణలు సమకూర్చారు. తాజాగా విడుదలైన ఈ “బ్రహ్మాండ” చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:
“ఇచ్చోళ” అనే గ్రామంలో ప్రతి అర్ధరాత్రి 12 గంటలకు హత్యలు జరుగుతూ ఉంటాయి. గత ఆరు నెలలుగా వరుసగా జరుగుతున్న ఈ హత్యలతో గ్రామస్తులు భయంతో వణికిపోతారు. ఈ మిస్టరీ హత్యలు పోలీసులకు పెద్ద సవాలుగా మారతాయి. ఫలితంగా, సాయంత్రం ఆరు దాటితే ఎవ్వరూ గ్రామ వీధుల్లో తిరగకూడదని పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేస్తారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో, గ్రామంలో జరిగే మల్లన్న జాతరను కూడా రద్దు చేయాలని ఆలోచిస్తారు. అసలు ఈ హత్యలకు కారణం ఎవరు? వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని ఛేదించారా? తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

విశ్లేషణ:
గ్రామీణ నేపథ్య కథలు, అక్కడి సంస్కృతి, కళలు ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాయి. వాటికి కాస్త ఆధ్యాత్మిక స్పర్శ తోడైతే మరింతగా ఆదరిస్తారు. అలాంటి ఓ గ్రామీణ కళా నేపథ్యాన్ని, ఒగ్గు కళాకారుల జీవితాన్ని, ఒక మర్డర్ మిస్టరీతో కలిపి “బ్రహ్మాండ” అనే ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ఆరంభం నుంచీ చివరి వరకూ అన్ని హత్యలు భయంతో అట్టుడికిపోయిన గ్రామంలో చివరకు ఏం జరిగిందన్న ఉత్కంఠను క్లైమాక్స్‌లో కన్విన్సింగ్ గా చూపించారు.

నటీనటుల గురుంచి అయితే ఆమని ఈ మధ్య కాలంలో చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. బలగం జయరాం తన పాత్ర పరిధిలో చక్కగా నటించారు. కొమరక్క పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఆమె నటన ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. బన్నీ రాజు, కనీకా వాధ్వల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. ఛత్రపతి శేఖర్ తనదైన సహజ నటనతో ఎప్పటిలాగే మెప్పించారు. నటుడు అమిత్ ప్రదర్శన కూడా ప్రశంసనీయం. దిల్ రమేష్, ప్రసన్నకుమార్, దేవిశ్రీ కర్తానందం వంటి మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దివంగత దర్శకుడు రాంబాబు… గ్రామీణ కళకు ఆధ్యాత్మికతను జోడించి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం. ఇది ప్రేక్షకులను కథలో లీనం చేస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త మెరుగుదల అవసరం అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఉన్నాయి. నిర్మాత దాసరి సురేష్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు. థియేటర్‌లో చూసి ఆస్వాదించదగిన చిత్రం ఇది.