తన వల్లే రాజ్‌కి ఈ పరిస్ధితి వచ్చిందని కావ్యను క్షమాపణలు అడుగుతుంది అపర్ణ. ఇంతలో యామిని వచ్చి నేను బావని కంటికి రెప్పలా కాపాడుకుంటే మీరు అతని ప్రాణాలతో చెలగాటం ఆడారని మండిపడుతుంది.
ఆమె మాటలతో రగిలిపోయిన కావ్య లాగి కొడుతుంది. మా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తావా? నా మొగుడిని సొంతం చేసుకోవాలని రెడీ అయిపోయావని ఫైర్ అవుతుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలని రెచ్చగొట్టి పంపించింది నువ్వేనని చెబుతుంది.
కావ్య కోపం చూసిన రుద్రాణి వెంటనే యామినిని బయటికి తీసుకెళ్లిపోయి కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండమని అంటుంది. ఇంతలో రాజ్ స్పృహలోకి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. కళావతి ఎక్కడ? ఆమె బాగానే ఉంది కదా? అని రాజ్ కేకలు వేస్తాడు. ఇదంతా చూసిన యామినికి రాజ్‌కి గతం గుర్తొచ్చినట్లు తెలుస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 30వ తేదీ ఎపిసోడ్ 813లో ఏం జరిగిందంటే?
కావ్య మెడలో మూడు ముళ్లు విప్పించి రాజ్ చేత నా మెడలో మూడు ముళ్లు వేయించుకోవాలని అనుకున్నానని తల్లిదండ్రులతో అంటుంది యామిని. దాని కోసం చేయని ప్రయత్నం లేదు, నిద్రపోని రాత్రి లేదని చెబుతుంది. ఎలాగైనా రాజ్‌ని సొంతం చేసుకోవాలని ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కావ్య అడ్డుపడుతూనే ఉందని రగిలిపోతుంది. చివరికి రాజ్‌కి యాక్సిడెంట్ చేసి, గతం మార్చిపోయేలా చేసి తనకి దగ్గరవ్వాలని అనుకున్నప్పటికీ ఆ కావ్య అయస్కాంతం లాగా రాజ్‌ని తనవైపుకే లాక్కుందని అంటుంది. చివరికి నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో, అదే జరిగేలా చేసిందని.. అది చాలదన్నట్లు అందరిముందు నన్ను చంప దెబ్బ కొట్టిందని రగిలిపోతుంది యామిని. ఆ కావ్యని మాత్రం వదలనని, దాని అంతుచూసి నా బావని నేను దక్కించుకునే వరకు నిద్రపోనని అంటుంది.
దాంతో యామిని తండ్రి రఘునందన్ మండిపడతాడు. ఇంత జరిగాక కూడా నీకు బుద్ధి రావడం లేదా? ఇకనైనా మా మాట విను, కన్నవాళ్లం కాబట్టి ఇన్నిరోజులు నా ఆనందం కోసం భరించామని అంటాడు. తను నీ జీవితంలోకి వస్తాడని, నిన్ను పెళ్లి చేసుకుంటాడని నువ్వు చెబుతుంటే అది తప్పు అని తెలిసినా ఎక్కడో ఓ మూలన చిన్న నమ్మకం ఉండేదని కానీ ఈరోజుతో ఆ నమ్మకం కూడా పోయిందని అంటాడు. రాజ్ ఎప్పటికీ కావ్య సొంతమేనని అర్ధమైపోయిందని, అది విడదీస్తే విడిపోయే బంధం కాదని, ఎన్ని జన్మలైనా విడిపోని తాళి బంధమని అంటాడు. ఇప్పటికైనా అన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టమని చెబుతాడు రఘునందన్.
ఎన్ని జన్మలెత్తినా నా మనసులో రాజే ఉన్నాడని, నా జీవితమే రాజ్ అని అవసరమైతే రాజ్ కోసం చచ్చిపోతానని యామిని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు. నాకు రాజ్ కావాలి అని గోల చేస్తుంది. నువ్వు అడిగేది ఏ వస్తువైనా అయితే ఎంత ఖర్చయినా పెట్టగలనని, మాట్లాడితే ఒప్పుకునేది అయితే కాళ్లు కూడా పట్టుకుంటానని అంటాడు. కానీ నువ్వు అడిగింది ఒక మనిషి ప్రేమనని దానిని మనసుతో కొనలేమని చెబుతాడు. రాజ్ తిక్క తిక్క మాట్లాడటానికి డాక్టర్ కారణం చెబుతాడు. ఆ మాటలతో రుద్రాణి మండిపడుతుంది. కట్టుకథలు చెప్పి మా దగ్గర డబ్బులు లాగాలని చూస్తున్నారా? అని ప్రశ్నిస్తుంది. మీకు మా మీద నమ్మకం లేకపోతే వేరే ఆసుపత్రికి తీసుకెళ్లొచ్చని, అవమానిస్తే మాత్రం ఊరుకోనని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు. ఇక నుంచి రాజ్ మీ అబ్బాయి లాగే నార్మల్‌గానే ఉంటాడని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. రాజ్‌ని ఈరోజే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పడంతో రాజ్‌తో మాట్లాడమని కావ్యతో చెబుతుంది అపర్ణ.
నేను కళ్లు తెరిచిన తర్వాత నా ముందు నువ్వే ఉండాలి కదా అని కావ్యతో రాజ్ అంటాడు. నేను కళ్లు తెరవగానే, నువ్వు ఎదురుగా లేకపోయేసరికి నీకేమైందోనని నేను కంగారు పడ్డానని చెబుతాడు. యాక్సిడెంట్ అయ్యేటప్పుడు నా కళ్లలో చూశావా? అని కావ్యని అడుగుతాడు రాజ్. నేను నీ కళ్లలో చూశానని, చావు ఎదురుగా ఉన్నప్పుడు ఆ దేవుడిని నేను ఒక్కటే కోరుకున్నాను. ఈ ప్రమాదంలో ఏం జరిగినా అది నాకే జరగాలని, నువ్వు క్షేమంగా ఉండాలని అనుకున్నాను అని రాజ్ చెప్పడంతో కావ్య కంటతడి పెడుతుంది. ఇక జీవితంలో ఈ చేతిని ఎప్పుడూ వదిలిపెట్టనని రాజ్‌తో అంటుంది కావ్య.
రాజ్‌ని దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికి తీసుకురాగా.. స్వప్న దిష్టి తీస్తుంది. మనవడు తిరిగొచ్చేసరికి నాన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని అంటుంది రుద్రాణి. నా ప్రాణం ఇప్పుడే తిరిగొచ్చిందని రాజ్‌తో అంటాడు సీతారామయ్య. నువ్వు మనసులో నుంచి తాతయ్య అనే ఈ పిలుపు కోసమే ఇన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్నానని అంటాడు. ఇప్పటి నుంచి నిమిషానికి ఒకసారి పిలుస్తానని చెబుతాడు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉండగా.. కావ్య కంటతడిపెడుతూ లోపలికి వెళ్లిపోతుంది. నేను ఆసుపత్రి నుంచి వచ్చేశాను కదా అయినా కావ్య ఎందుకు ఏడుస్తూ వెళ్లిందని అపర్ణని అడుగుతాడు రాజ్. ఇన్నాళ్లు నరకం అనుభవించిందని అపర్ణ చెప్పగా.. నరకం అనేది చాలా చిన్న పదమని.. కట్టుకున్న భర్తే అనుమానిస్తే ఏ భార్య అయినా ఎలా తట్టుకుంటుదని అంటుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు.
నేను నా భార్యని ఎందుకు అనుమానిస్తానని అడుగుతాడు రాజ్. మీరందరూ నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారని, మర్యాదగా అదేంటో చెప్పాలని ప్రశ్నిస్తాడు. నేనేం చేశాను, కళావతి ఎందుకలా ఏడ్చుకుంటూ వెళ్లిపోయిందని నిలదీస్తాడు. నువ్వు భరించలేనంత బాధపెట్టావని జరిగినదంతా చెబుతుంది అపర్ణ. యాక్సిడెంట్‌లో మేమంతా నువ్వు చనిపోయావనే అనుకున్నామని, కానీ కళావతి మాత్రం నువ్వు బ్రతికే ఉన్నావని నమ్మి నిన్ను వెతకడం మొదలుపెట్టిందని అంటుంది. నువ్వు యామిని ఇంట్లో గతం మరిచిపోయి ఉంటున్నావని తెలిసిందని చెబుతుంది. మమ్మల్ని నువ్వు గుర్తుపట్టకపోయినా ఆ దేవుడు వేసిన బంధం ఆ కావ్య నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ వల్ల తిరిగి నువ్వు కావ్యని ప్రేమించడం మొదలుపెట్టావని అంటుంది రుద్రాణి.
తనను తిరిగి పెళ్లి చేసుకోవాలని అనుకున్నావని, అప్పుడే నువ్వు తండ్రివి కాబోతున్నావని తెలిసిందని అపర్ణ చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు. ఏ భార్య అయినా తను కడుపుతో ఉన్న విషయం మొదట తన భర్తకు చెప్పాలని ఆశ పడుతుందని, కానీ కావ్యకి ఆ దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వలేదని అంటుంది. నీ గతాన్ని గుర్తుచేస్తే నీ ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో నీకు గతాన్ని చెప్పలేక తను తల్లి కాబోతోందని విషయం దాచలేక తనలో తానే నరకం అనుభవించిందని చెబుతుంది.
తన కడుపు విషయం బయటపడి, తను ఎవరి వల్లనో కడుపు తెచ్చుకుందని ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని నువ్వు నిందించడం మొదలుపెట్టావని చెబుతుంది ఇందిర. భర్త తిట్టినా, కొట్టినా భరించే భార్య తనకు వేరే సంబంధం ఉందని భర్త నిందిస్తే మాత్రం గుండె ఆగిపోతుందని.. కానీ కావ్య అది కూడా భరించిందని.. నిజాన్ని మాత్రం బయటపెట్టలేదని చెబుతుంది అపర్ణ. నీ ప్రాణమా, తన మానమా అని ఆలోచిస్తే నీ ప్రాణమే ముఖ్యమని తప్పుడు మనిషిగా నీ ముందు నిలబడిందని అంటాడు సుభాష్.
నువ్వు ఎక్కడో ఒక చోట ప్రాణాలతో సంతోషంగా ఉంటే చాలని ఆ మచ్చను జీవితాంతం మోయడానికి సిద్ధపడిందని చెబుతుంది అపర్ణ. ఈ రోజుల్లో కూడా అలాంటి భార్య దొరకాలంటే ఎన్నో జన్మలెత్తాలని అంటుంది. నిజం చెప్పలేక, నీతో మాట్లాడలేక కుమిలిపోయిందని చెబుతుంది. తల్లి మాటలతో బాధపడ్డ రాజ్.. కావ్యని హత్తుకుని ఓదారుస్తాడు. ఒక మనిషిని ప్రేమిస్తే, ఇంతలా ప్రేమించొచ్చని నిన్ను చూస్తుంటేనే అర్ధమవుతుందని అంటాడు రాజ్. నేను నీకేం చేశాను, ఇష్టం లేని పెళ్లి చేసుకోని నిన్ను భార్యగా కూడా గుర్తించలేదని, ఇంటికొచ్చిన దగ్గరి నుంచి అవమానించానని చెబుతాడు. నువ్వు చేసిన ప్రతి పనిని తప్పుపట్టానని, అప్పుడు కూడా నువ్వే మొండిగా నిలబడి నా మనసులో స్థానాన్ని సంపాదించుకున్నావని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.