Brahmamudi August 26th Episode: ఎవడితో తిరిగి కడుపు తెచ్చుకున్నావ్.. రాజ్ మాటలతో కావ్య మనసు ముక్కలు

Brahmamudi August 26th Episode: ఎవడితో తిరిగి కడుపు తెచ్చుకున్నావ్.. రాజ్ మాటలతో కావ్య మనసు ముక్కలు 


రాజ్‌కు ఎందుకు మందు అలవాటు చేశావని యామినిపై ఆమె తల్లిదండ్రులు మండిపడతారు. బావని నా దారిలోకి తీసుకురావడానికి తప్పలేదని ఆమె క్లారిటీ ఇస్తుంది.

ఇంతలో మందు తాగి పడిపోయిన రాజ్‌ను తీసుకుని యామిని ఇంటికి వస్తుంది కావ్య. బావకి నేనే మందు అలవాటు చేశానని, నీ మీదున్న కాస్త ప్రేమను కూడా చంపేస్తానని చెప్పడంతో యామినిని లాగిపెట్టి కొడుతుంది కావ్య. నీ జీవితం కూడా శూర్పణక జీవితం లాగే ముగిసిపోతుందని యామినికి కావ్య వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. కావ్య మీద నువ్వు గెలవలేవని, ధర్మం మీద అధర్మం గెలిచినట్లు చరిత్రలో లేదని యామినితో అంటాడు తండ్రి.

ఏడుస్తూ ఇంటికొచ్చిన కావ్యను చూసి అపర్ణ, ఇందిరలు ఏం జరిగిందని అడుగుతారు. మీ అబ్బాయి తాగుడికి బానిసై రోడ్లు మీద పడిపోతున్నాడని కావ్య చెప్పడంతో ఇద్దరూ బాధపడతారు. మందు అయిపోవడంతో యామినిని మరో బాటిల్ అడుగుతాడు రాజ్. ఇంతలో అపర్ణ, ఇందిరలు వచ్చి అతనిని నిలదీస్తారు. నా కోడలి చేత పెట్టించిన ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు సమాధానం చెబుతావని యామినికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 26వ తేదీ ఎపిసోడ్ 810లో ఏం జరిగిందంటే?

రాజ్‌ని ఇలాగే వదిలేస్తే పూర్తిగా తాగుడికి బానిసైపోతాడని.. వీలైనంత త్వరగా యామిని దగ్గరి నుంచి తీసుకొచ్చేయాలని చెబుతుంది అపర్ణ. కానీ రాజ్ మనం మోసం చేశామనే బాధలో ఉన్నాడని.. మన మాట వింటాడా? అని స్వప్న ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా వినడని ఏదో ఒక రకంగా వాడికి నచ్చచెప్పాలని అంటుంది అపర్ణ. రాజ్ ఏమైనా చిన్న పిల్లాడా? చాక్లెట్ ఇచ్చి బుజ్జగించి, నచ్చచెప్పడానికి అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. రాజ్ ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్లు తనని మోసం చేశాడన్న కోపంలో ఉన్నాడని, అది పోవాలంటే కావ్య వెళ్లి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నువ్వేనని చెప్పాలని అంటుంది రుద్రాణి. అలా చెప్పాలంటే రాజ్ మరిచిపోయిన తన గతం గురించి కూడా చెప్పాలని, నిజం చెప్పాక మనందరికీ శాశ్వతంగా దూరమైతే అని ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

అసలు నువ్వు నిజం చెప్పకపోయుంటే పరిస్ధితి ఇక్కడి దాకా వచ్చేది కాదని అంటుంది అపర్ణ. తన కొడుకుని అలా వదిలేయగలదేమో కానీ నేను నా కొడుకుని వదిలేయలేనని చెబుతుంది. ఏదో రకంగా వాడి మనసు మార్చి దారికి తెచ్చుకుంటానని, అవసరమైతే కావ్య కడపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనన్న నిజాన్ని కూడా చెప్పేస్తానని అంటుంది అపర్ణ. ఆయన మారకపోయినా పర్లేదు కానీ మీరు మాత్రం తొందరపడి అలాంటి పనిచేయొద్దని చెబుతుంది కావ్య. మనమేమీ చేయొద్దని కాలం వేసిన నిందని ఆ కాలమే పొగొడుతుందని అంటుంది. జరిగిన అనర్ధాలు చాలని ఇంకా ఇంకా ఇలాంటివి జరగడం నాకు ఇష్టం లేదని చెబుతుంది.

కావ్య తనను కొట్టడంతో రగిలిపోతుంటుంది యామిని. బావని మీకు శాశ్వతంగా దూరంగా చేస్తానిన అనుకుని రాజ్ దగ్గరికి వెళ్తుంది. నువ్వు బాధను మరిచిపోతావని మందు ఇస్తే, నువ్విలా మందుకు బానిస అయిపోతున్నావని అంటుంది యామిని. ఏం చేసినా బాధ మాత్రం పోవడం లేదని అంటాడు రాజ్. ప్రేమిస్తే ఇంత పిచ్చిగా ఉంటారా? అనుకునే దానిని ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్ధమవుతుందని అంటుంది. నాకెందుకో కళావతి కూడా నిన్ను ప్రేమించింది అని అనిపిస్తోందని చెబుతుంది యామిని. నిజంగా తను ప్రేమిస్తే ఇలా ఎందుకు మోసం చేస్తుందని అడుగుతాడు రాజ్. కళావతి నన్ను ప్రేమించలేదని, నేను తన మనసులో లేనని అంటాడు.

నిన్ను కళావతి ఖచ్చితంగా ప్రేమించిందని, ఇన్నిరోజులు తను ప్రెగ్నెంట్ అని తెలిసి ఉండదని అందుకే నీతో అలా తిరిగి ఉంటుందని చెబుతుంది యామిని. కానీ సడెన్‌గా ఆ విషయం బయటపడేసరికి నిన్ను మోసం చేయడం ఇష్టం లేక, తను ఎవరి చేతో మోసపోయిన విషయం నీతో చెప్పలేక అలా మాట్లాడి ఉంటుందని అంటుంది యామిని. నీ ప్రేమకి తన ప్రెగ్నెన్సీ అడ్డు అయితే దానిని నువ్వెందుకు యాక్సెప్ట్ చేయడం లేదని నిలదీస్తుంది. తనను పెళ్లి చేసుకుని ఒక లైఫ్ ఇద్దామని అనుకున్న నీకు ఆ బిడ్డకు ఒక తండ్రి స్థానంలో ఉండొచ్చు కదా అని అంటుంది. కళావతి దగ్గరికి వెళ్లి ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెబితే, నిన్ను క్షమించి పెళ్లి చేసుకుంటానని చెప్పు అని అంటుంది యామిని. ఖచ్చితంగా ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటానని, ఈరోజే వెళ్లి ఆ నిజం ఏంటో తేల్చేస్తానని అంటాడు రాజ్.

రాజ్ తప్పతాగి దుగ్గిరాల వారింటికి వెళ్లి కళావతిని పిలుస్తూ రంకెలు వేస్తాడు. రాజ్‌ని అలా చూసి అంతా బాధపడతారు. నేను ఇలా తాగడానికి కారణం మిస్ కళావతేనని అంటాడు రాజ్. అసలు ఆమె మిస్సా, మిసెసా అని నిలదీస్తాడు రాజ్. మీరు నిజాలు చెప్పరు కదా మరిచిపోయానని అంటాడు. కళావతి వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలనని అక్కడే కూర్చొంటాడు రాజ్. ఇంతలో కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి మళ్లీ ఎందుకొచ్చారని నిలదీస్తుంది. నేను నిన్ను కలిసినప్పటి నుంచి ఇదే ప్రశ్న అడుగుతూనే ఉన్నావని మండిపడతాడు రాజ్. నేను నిన్ను ప్రేమిస్తున్నట్లే.. నువ్వు నన్ను ప్రేమించడం అని అంటాడు. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రతిసారి నీ కళ్లలో ఆనందాన్ని చూశానని.. ఆఫీస్‌లో ప్రాబ్లమ్‌లో అనగానే నీకు సాయం చేస్తే కన్నీళ్లు పెట్టుకున్నావ్, నీ చెల్లెలు అరెస్ట్ కాకుండా కాపాడితే గుండెలకు హత్తుకున్నావ్ ఇదంతా ఎందుకు చేశావ్ అని నిలదీస్తాడు రాజ్.

నువ్వు ఈరోజు వచ్చి నిలదీస్తావని తెలిసుంటే అసలు నీకు దగ్గరయ్యే దానిని కాదని అంటుంది కావ్య. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని తేలిపోయింది కాబట్టి.. నేనొక నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యానని రాజ్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. నువ్వు కడుపుతో ఉన్నావని నాకు తెలుసు.. అయినాసరే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయానని చెబుతాడు. నువ్వు నన్ను ఎంత మోసం చేసినా, కడుపులో ఒక బిడ్డ పెరుగుతుందన్న నిజాన్ని దాచి పెట్టినా నీమీద ప్రేమను చంపుకోలేకపోతున్నానని అంటాడు రాజ్. నిన్ను మరిచిపోయి దూరంగా ఉండలేకపోతున్నానని, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని అంటాడు రాజ్. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని కూడా నేనే అవుతానని, ఆ బిడ్డ బాధ్యతను నేనే తీసుకుంటానని చెబుతాడు.

రాజ్ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. వీడేంట్రా ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తాడు.. నిజం తెలిస్తే వదిలేసి వెళ్లిపోతాడనుకుంటే పెళ్లి చేసుకుని అంటాడేంటీ అని రాహుల్‌తో అంటుంది. నేను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండీషన్.. ఇప్పటి వరకు నువ్వేంటో, నీ గతమేంటో నేను ఎప్పుడు అడగలేదని అంటాడు రాజ్. భవిష్యత్తులో కూడా అడగనని, నీ మీద నమ్మకంతో లైఫ్ లాంగ్ నీతో కలిసుండాలని అనుకుంటున్నానని.. అలా జరగాలంటే నాకో నిజం తెలియాలి? నీ కడుపుపలో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? ప్రశ్నిస్తాడు. నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా? లేకపోతే నువ్వే మోసపోయావా? అని నిలదీస్తాడు రాజ్. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు.. నీ మెడలో తాళికట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతానని అంటాడు. రాజ్ మాటలతో రుద్రాణి, రాహుల్‌లు సంతోషిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.