Ram Charan.. Young heroine rejects huge offer


 

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో కలిసి నటించాలన్నది ఎంతో మంది కల. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్.. ఇప్పుడు ఇండియాలోని టాప్ స్టార్స్‌లో ఒకరు.

ప్రతి సినిమాకు వైవిధ్యం చూపుతూ విభిన్నమైన కథలతో దూసుకెళ్తోన్న ఆయన.. ఈ ఏడాది గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం పెద్ది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో చరణ్‌తో నటించే అవకాశాన్ని ఓ యంగ్ హీరోయిన్ తిరస్కరించింది. ఆమె ఎవరు? ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది చూస్తే..


తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్వాసిక. తొలుత వైగై అనే మూవీ ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అనంతరం పలు మలయాళ సినిమాలలో నటించారు. ఎటు చూసినా నువ్వే అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ ఏడాది రెట్రో, మామన్, తమ్ముడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం భోగీ, కరుప్పు సినిమాలలో నటిస్తున్నారు. సినిమాలే కాదు బుల్లితెరపైనా శ్వాసిక సత్తా చాటారు. పలు సీరియల్స్, షోలలో పాల్గొనడంతో పాటు హోస్ట్‌గానూ వ్యవహరించారు.


ఆ పాత్రకు గుర్తింపు


అయితే హీరోయిన్‌గానే చేస్తానని గిరి గీసుకుని కూర్చోకుండా తన వయసును మించిన పాత్రలు అవసరమైతే తన కంటే పెద్ద వయసు వారికి తల్లిగా నటించేందుకు కూడా సిద్ధమని ప్రూవ్ చేసుకున్నారు శ్వాసిక. 33 ఏళ్ల వయసులోనే ఓ పెద్ద వయసు అమ్మాయికి తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. అదే లబ్బర్ పండు.. ఈ సినిమాలో శ్వాసిక పోషించిన పాత్ర, ఈ చిత్రం అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్వాసిక మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


లబ్బర్ పండు తర్వాత తనకు అదేపనిగా తల్లి పాత్రలు వస్తున్నాయని తెలిపింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌కు తల్లి పాత్రలో నటించమని ఆఫర్ వచ్చిందని, దాంతో తాను షాక్‌కు గురయ్యానని శ్వాసిక ఆవేదన వ్యక్తం చేశారు. మరో మాట లేకుండా వెంటనే ఆ సినిమాకు నో చెప్పానని ఆమె వెల్లడించారు. రామ్ చరణ్ తల్లి పాత్ర తనకు వచ్చినప్పుడు షాకయ్యా.. పెద్ది అనే భారీ తెలుగు సినిమా కోసం తనను సంప్రదించారు. అది భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న సినిమా.. అయినప్పటికీ ఆ ఆఫర్‌ను నేను వదులుకున్నా. ఒకవేళ ఆ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ, ప్రస్తుతానికి నేను రామ్ చరణ్ తల్లిగా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నో చెప్పానని శ్వాసిక పేర్కొన్నారు.


మార్చిన 27న పెద్ది రిలీజ్


వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సతీష్ కిలారు దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో పెద్ది సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దివ్యేందు శర్మ, జగపతిబాబులు తదితరులు నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.