Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ, నర్మదలు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. సాగర్ వచ్చి నర్మద ముందు బైక్ ఆపుతాడు. నర్మద సాగర్ అని పిలవగానే ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు.
నర్మద కన్నీరు పెట్టుకుంటుంది. ప్రేమ నర్మదతో ఏంటి అక్క బావ మాట్లాడుతున్నాడు అన్నావ్ ఇప్పుడు నిన్ను చూసి కూడా పట్టించుకోకుండా సీరియస్గా వెళ్లిపోతున్నాడు.. అంటే నేను బాధ పడకూడదు అని నాకు అబద్ధం చెప్పావు కదా.. బావ నీ మీద కోపంగా ఉన్నాడు కదా అని అడుగుతుంది ప్రేమ.
ప్రేమ ప్రశ్నకు నర్మద నేనేదో తప్పు చేసినట్లు నన్ను దూరం పెడుతున్నాడు నాతో మాట్లాడటం లేదు సర్లే ఎన్ని రోజులు మాట్లాడడో నేను చూస్తా అని అంటుంది. ఇదంతా నా వల్లే కదా అక్క అని ప్రేమ ఏడుస్తుంది. నర్మద ప్రేమకి సర్ది చెప్తుంది. మీ ఆయన కూడా నీతో మాట్లాడటం లేదని నాకు అర్థమైంది.. ప్రస్తుతానికి మనం నీకు నీ వారు లేరు.. నాకు నా వారు లేరు అని పాట పాడుకుంటూ వెళ్దాం పద అని ప్రేమతో చెప్పి ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్లిపోతారు.
వేదవతి రామరాజు వల్లికి బాధ్యతలు ఇవ్వడం తనని దూరం పెట్టడం గుర్తు చేసుకొని ఏడుస్తుంటుంది. నర్మద, ప్రేమ చూస్తారు. తిరుపతి అక్క దగ్గరకు వెళ్లి ఏంటి అక్క నువ్వు ఏడుస్తున్నావా.. బావ నిన్ను తిట్టడం ఏమైనా మొదటి సారా ఇవన్నీ నువ్వు లైట్ తీసుకోవాలక్కా ఏదో కొంప మునిగిపోయినట్లే ఏడ్వటం ఏంటి అక్క అని అంటాడు. దాంతో వేదవతి తమ్ముడిని ప్రేమగా దగ్గరకు పిలిచి లాగి పెట్టి కొట్టి ఇది నీకు చిన్న విషయంలా కనిపిస్తుందా అని కొడుతుంది. తిరుపతి చెంప మీద చేయి వేసుకొని వెళ్లి నర్మద వాళ్లతో నేను మీ అత్తని నవ్వించాలని అనుకుంటే ఎలా కొట్టిందో చూడు అని చెప్తాడు. దాంతో నర్మద ప్లాన్ చెప్పి అలా చేయమని అంటుంది. మళ్లీ కొడుతుందని తిరుపతి ఏడిస్తే ఏం పర్లేదులే వెళ్లు అని అంటుంది.
తిరుపతి మళ్లీ వేదవతి దగ్గరకు వెళ్లి నీ దగ్గర నుంచి ఆవల్లికి బాధ్యతలు ఇవ్వడం తప్పే అక్క అని అంటాడు. దాంతో వేదవతి పోయి పోయి మొరటవాడిని పెళ్లి చేసుకున్నా ఇలాంటి అర్థం చేసుకోలేని మొగుడు నాకు ఎందుకు.. ఈ మొరటి మొగుడితో పాతికేళ్లగా కాపురం చేయలేక చస్తున్నా.. ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేస్తే నాకు బాధ్యతలు తెలీవు అంటారా అని కోపంతో ఊగిపోతుంది. దాంతో తిరుపతి పదక్కా మన రాజ్యానికి వెళ్లిపోదాం అని తిరుపతిని పుట్టింటి వైపు తీసుకెళ్తాడు. కోపంగా వేదవతి వెళ్లి సడెన్గా ఆగి తిరుపతిని కొట్టి భార్యభర్తలు అంటే సవాలక్ష ఉంటాయి. ఈ మాత్రానికి మమల్ని విడదీస్తావా పోరా నీ ఇంటికి నేను బాధ పడుతుంటే నన్ను నీ ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటావా అంటుంది. దాంతో తిరుపతి నీ ఇద్దరు కోడళ్లు నిన్న నవ్వించాలని ఇలా చేశారని చెప్తాడు. దాంతో వేదవతి ఇద్దరినీ కోపంగా చూసి వెళ్లిపోతుంది.
ప్రేమ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు తలచుకొని ఏడుస్తుంటుంది. ధీరజ్ కూడా అర్థం చేసుకోవడం లేదని బాధ పడుతుంది. ధీరజ్ ప్రేమని చూసి వెనక్కి వెళ్లిపోతాడు. ప్రేమ తనతో తాను ఈ ఇంట్లో నేను అందరూ ఉన్న ఏకాకిని అయిపోయా ఈ ఇంట్లో ఎందుకు ఉండాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. ధీరజ్ ప్రేమ కోసం అన్నం తీసుకొస్తాడు. ఉదయం నుంచి నువ్వేం తినడం లేదు నా మీద కోపం ఫుడ్ మీద ఎందుకు తిను అని అంటాడు. దాంతో ప్రేమ కోపంగా వస్తువులకు ఎవరి మీద కోపం రాదు.. వస్తువులకు ఆకలి వేయదు అని అంటుంది. నీరసంతో కళ్లు తిరిగి పడిపోతావ్ పంతం పక్కన పెట్టి తిను అని ధీరజ్ అంటాడు. నువ్వేం నా మీద జాలి చూపించకు అని ప్రేమ అంటే జాలీ లేదు ఏం లేదు నీకు మళ్లీ ఏమైనా అయితే మీ వాళ్లు మళ్లీ మా నాన్న మీదకు వచ్చేస్తారు లేకపోతే నువ్వు తింటే నాకు ఏంటి తినకపోతే నాకు ఏంటి అని అంటాడు.
ధీరజ్ మాటలకు ప్రేమ అన్నం ప్లేట్ విసిరేస్తుంది. నువ్వు నన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడటం లేదురా అందుకే నా గుండెల్లో ఎంత బాధగా ఉందో నాకే తెలుసు అని వెళ్లి ఏడుస్తుంది. ప్రేమ ఓ మూల కూర్చొని ఏడుస్తుంది. ధీరజ్ మరోవైపు కూర్చొని బాధ పడతాడు.
ఉదయం శ్రీవల్లి తాళాల గుత్తి పట్టుకొని తిరుగుతూ మనకి పెత్తనం వచ్చేసింది కదా మన పవర్ ఏంటో తోటికోడళ్లకి తెలిసేలా చేయాలి అంటే వాళ్లకి ఫుల్లుగా టార్చర్ పెట్టేయాలి అని ప్రేమ గదికి వెళ్తుంది. ప్రేమ మంచానికి ఆనుకొని పడుకోవడం చూసి నీకు మీ ఆయనకు ఇంకా గొడవలు తగ్గలేదని అర్థమైపోతుంది అని అనుకుంటుంది. చెంబుతో నీరు తీసుకొచ్చి ప్రేమ ముఖం మీద విసురుతుంది. ప్రేమ షాక్ అయి లేస్తుంది. నా మీద నీరు చల్లడానికి ఎంత ధైర్యం నీకు అని అడుగుతుంది. దాంతో శ్రీవల్లి ఇదంతా మామయ్యగారు నాకు ఇచ్చిన ఈ తాళాల పవర్ ఇంట్లో అందర్ని బాధ్యతలో పెట్టడం నా పని నువ్వు ఇంత సేపు పడుకుంటే నేను ఊరుకోను అంటుంది. నేను ఇలాగే పడుకుంటా అని ప్రేమ అంటే ఇక నుంచి అలా కుదరదు.. 5కి లేచి ఇళ్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి అంటుంది. దానికి ప్రేమ నేనేం చేయను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.