అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలతో కొన్ని సినిమాలు వివాదానికి కేంద్ర బిందువుగా మారితే.. టైటిల్‌తో కొన్ని చిత్రాలు వివాదంలో చిక్కుకుంటుంటాయి. ఈ రెండో జాబితాలోని సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' (Janaki vs State of Kerala).
ఈ చిత్రానికి, ఇందులోని కథానాయికకు జానకి పేరు పెట్టడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టైటిల్‌లో చిన్న మార్పుతో ('వి' యాడ్ చేశారు) (Janaki v vs State of Kerala) ఎట్టకేలకు జులైలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ 'జీ 5' (Zee 5)లో స్ట్రీమింగ్ అవుతోంది. సురేశ్ గోపి (Suresh Gopi), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఏముంది?
జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తుంటుంది. పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు కేరళలోని సొంతూరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లిన జానకిపై లైంగిక దాడి జరుగుతుంది. న్యాయ పోరాటంలో ఆమె ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? గొప్ప పేరున్న అడ్వకేట్ డేవిడ్ (సురేశ్ గోపి) నిందితుల పక్షాన వాదించడానికి కారణమేంటి? తన ప్రమేయం లేకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రభుత్వమే చూసుకోవాలన్న జానకి విజ్ఞప్తిపై కేరళ హై కోర్టు ఎలా స్పందించింది? (Janaki v vs State of Kerala Story)
న్యాయ పోరాటంలో యువతి గెలిచిందా, లేదా? అన్న పాయింట్‌తో రూపొందిన సినిమా ఇది. చెప్పే అంశం చిన్నదైనా ఆసక్తికరంగా తెరకెక్కించి, విజయం అందుకున్న దర్శకులు ఎందరో. ఈ విషయంలో మలయాళ డైరెక్టర్లు ముందుంటారు. కానీ ప్రవీణ్ నారాయణన్ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయారు. అనవసర సన్నివేశాలతో సినిమాని రెండున్నర గంటలపాటు సాగదీశారు. ఇంతకు ముందు తెరకెక్కని కథా? అంటే అది కూడా కాదు. లీగల్ బ్యాక్‌డ్రాప్ మూవీ నుంచి సగటు ప్రేక్షకుడు ఆశించే వాద ప్రతివాదనల సీక్వెన్స్ మాత్రం వర్కౌట్ అయింది (Janaki v vs State of Kerala Review). కోర్టు రూమ్ ఎపిసోడే ఈ చిత్రానికి బలం.
వెబ్ సిరీస్ రివ్యూ: కానిస్టేబుల్ కనకం.. అడవిగుట్టలో ఏం జరిగింది?
ప్రారంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగినా.. ఓ చర్చి ఫాదర్‌తో డేవిడ్ సమావేశమవడం నుంచి కథపై కాస్త ఆసక్తి కలుగుతుంది. డేవిడ్‌పై ప్రేక్షకుడు ఓ అంచనాకు వచ్చేస్తాడు. జానకి కేసులో నిందితుల తరఫున వాదించేందుకు డేవిడ్ ముందుకు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. అప్పటి వరకూ పాజిటివ్‌గా ఉన్న డేవిడ్ నెగెటివ్‌గా కనిపిస్తాడు. సంఘటన గురించి జానకిని డేవిడ్ ప్రశ్నించే తీరు ఆకట్టుకుంటుంది. కావాలనే జానకి ఆయా యువకులపై ఆరోపణలు చేస్తోందా? అన్నంతగా వాదన కొనసాగుతుంది. తగిన ఆధారాలు కూడా సమర్పించడంతో న్యాయస్థానం ఆ కేసును కొట్టేస్తుంది. తండ్రిని కోల్పోవడం, కేసు ఓడిపోవడం, గర్భం దాల్చడం.. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న జానకికి సపోర్ట్‌గా నిలిచే కానిస్టేబుల్ పాత్ర సెకండాఫ్‌లో కీలకం. తనదైన శైలి ఇన్వెస్టిగేషన్ చేసి జానకి కేసును రీ ఓపెన్ చేయించడం, ఆ కేసులో ఈసారి డేవిడ్ తన కూతురిని రంగంలోకి దింపడం ఆసక్తికరం. క్లైమాక్స్ ఊహించదగ్గదే.
కుటుంబంతో కలిసి చూడొచ్చా?: లైంగిక దాడికి గురైన కథానాయికకు.. సీతాదేవి మరో పేరైన జానకిని పెట్టడంపైనే సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఇందులో ఇబ్బందికర విజువల్స్ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగులో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.
చివరిగా: జానకి.. జస్ట్ ఓకే!(Janaki v vs State of Kerala Review)